మహా కవి కాళిదాసు
మహాకవి కాళిదాసు గురించి అందరికీ తెలుసు. ఆయన అంత సుప్రసిద్ధుడు. శతాబ్దాల గడుస్తున్నా వన్నె తగ్గని కీర్తి ఆయనది. సాధారణ విషయాలను కూడా ఎంతో చమత్కారంగా చెప్పడం, అడగడం ఆయనకే చెల్లింది అంటారు పండితులు.ఆయన కాలంలో జరిగిన ఒక ఆసక్తి కథనం ఇది.
అది ధారా నగరంలో వారవనితల వీధి. ఆ వీధిలో ఒక రంగుటద్దాల మేడ! ఆ మేడ వసారాలో, పూసల తెరల వెనుక, పందొమ్మిదేళ్ళ పడుచుపిల్ల తూగుటుయ్యాలలో ఊగుతూ ఏవేవో శ్లోకాలు రాగయుక్తంగా వల్లె వేస్తోంది.
అదే వీధి గుండా పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ భవభూతి, కాళిదాసు వెళ్తున్నారు. వాళ్ళు వీనుల విందుగా వినబడుతున్న ఆ స్వరానికి ఆకర్షితులై అటు వైపు చూసారు. తాంబూల చర్వణంతో ఎర్రగా పండిన ఆ అమ్మాయి అధరాలు చూడగానే వారిరువురికి తాంబూలం గుర్తుకువచ్చింది. వెంటనే వాళ్ళ దగ్గరున్న తాంబూలపు పెట్టె తెరచి చూసారు. భవభూతి పెట్టెలో సున్నం అయిపోయింది. అప్పుడు భవభూతి ఆ అమ్మాయిని ఉద్దేశించి,
“తూర్ణమానీయతాం చూర్ణమ్ పూర్ణచంద్రనిభాననే”
అని అడిగాడు. అనగా, “పున్నమి చంద్రునివంటి ముఖము గల ఓ సొగసరీ! కాసింత సున్నం తెచ్చిపెట్టు” అని అర్థం.
తరువాత కాళిదాసు తన పెట్టెలో తమలపాకులు కూడా లేకపోవడం చూసి, వెంటనే
“వర్ణాని స్వర్ణపర్ణాని కర్ణంతాకీర్ణలోచనే”
అంటూ శ్లోకాన్ని పూర్తి చేసేడు. అనగా, “చెంపకి చేరడేసి కళ్ళు గల ఓ చక్కని చుక్కా! పసిడివన్నె గల లేత తమలపాకులు కూడా ఇవ్వూ!” అని అర్థం.
మహాకవులు వలె ఉన్న ఆ ఆగంతుకులని చూచి, చటుక్కున లేచి, అంజలి ఘటించి, వారిరువురికి కూర్చోవడానికి ఆసనాలు చూపించి, లోపలికి వెళ్లి ఆకులూ, వక్కలు, సున్నం ఉన్న వెండి పళ్లెం వారి ముందు ఉంచి, వినయము, విలాసము ఉట్టిపడుతూ ఉండగా మొదట కాళిదాసుకి తమలపాకులు, తరువాత భవభూతికి సున్నం అందించిందిట ఆ అమ్మాయి.
ఈ ప్రవర్తన చూసి భవభూతికి కోపం వచ్చింది., “ఏమిటీ పక్షపాతం? సున్నం తెమ్మని ముందుగా అడిగింది నేను. తరువాత కదా కాళిదాసు ఆకులు అడిగింది? ఇదెక్కడి ధర్మం?” అని నిలదీసి అడిగేడట.
దానికి ఆ అమ్మాయి సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలతో, “క్షమించాలి. పూజా వ్యతిక్రమం జరిగితే మన్నించాలి. సామాన్య ధర్మం మాట ఎలా ఉన్నా, మా వృత్తి ధర్మం ప్రకారం మిక్కిలి రొక్కము ఇచ్చినవారంటేనే మా కులంవారు ఎక్కువ మక్కువ ప్రదర్శిస్తారు. తక్కినవాళ్లు తరువాతే!” అని గడుసుగా సమాధానం చెప్పిందిట!
ఆ జవాబు విని ఆ అమ్మాయి సమయస్ఫూర్తికి, సంవాద చాతుర్యానికి ముచ్చటపడి, కవులిద్దరూ ఆమెని మనసారా ఆశీర్వదించి, ముందుకి కదిలి వెళ్లిపోయారట! అదీ కథ!!
పై విషయం చదివిన వాళ్లకు ఒక అనుమానం వస్తుంది. భవభూతి కాళిదాసు ఇద్దరూ ఆ అమ్మాయికి ఎలాంటి డబ్బూ ఇవ్వలేదు కదా మరి వాళ్ళు ఏమిచ్చారు?? ఎప్పుడిచ్చారు?? ఆ అమ్మాయి ఎప్పుడు తీసుకుంది?? అనే అనుమానాలు.
పైన శ్లోకంలో ఒక చమత్కారం ఉంది. అదే కథకి ఆయువుపట్టు. భవభూతి చెప్పిన శ్లోక పాదంలో తూర్ణ, చూర్ణ, పూర్ణ అనే మాటలలో మూడు “ణ” లు ఉన్నాయి. కాళిదాసు పూర్తి చేసిన పాదంలో వర్ణ, స్వర్ణ, పర్ణ, కర్ణ, అకీర్ణ అనే మాటలలో అయిదు “ణ” లు ఉన్నాయి. తెలుగువారు ణ అనే అక్షరాన్ని “అణా” అని ఉచ్చరిస్తారు: ట, ఠ, డ, ఢ, అణా. కానీ అణా అనేది ఒక నాణెం కూడా కదా! ఈ కోణంలో చూస్తే భవభూతి ముట్టజెప్పినది మూడు అణాలు, కాళిదాసు ఇచ్చినది అయిదు అణాలు అని మనం అన్వయించుకోవాలి.
ఇలా ఎన్నో చమత్కారాలతో కవుల కాలం అద్భుతంగా సాగిందని ఇలాంటి విషయాలతో అర్థమవుతుంది
https://www.teluguone.com/news/amp/content/kalidasa-humour-35-138567.html
No comments:
Post a Comment